Tuesday 22 January 2013

అన్నా తిరుమలరాయ..

తెలంగాణ మీద డిల్లీ నుండి వెళువడుతున్న ప్రకటనలకు ఇక్కడ సీమాంధ్ర నాయకులకు చురుకు తగులుతుంది. ఇప్పుడు అన్ని ప్రాంత నేతల వాదనలలో వేడి పెరిగింది. ఇన్నాళ్లు తెరచాటు రాజకీయాలు నడిపిన కే"వీపి" లు కూడా ఇప్పుడు లీడ్ రోల్ తీసుకుంటున్నారు. ప్రజల కోరిక మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి తప్ప తుచ్చమైన రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విడదీయకూడదట.


ఈరోజే కాదు మరెప్పుడైనా తెలంగాణ అన్నది ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే అది పార్టీల రాజకీయ లబ్దికోసకే ఏర్పడుతుంది తప్ప ఇక్కడ ప్రజల కోరికను మన్నించి ఎంత మాత్రం కాదు. అన్ని పార్టీలు తెలంగాణ భావోద్వేగాలను ఓట్లలా మలుచుకోవడానికే రెడీగా ఉన్నాయి తప్ప తెలంగాణ ప్రజల కోరిక మేరకు రాష్ట్ర ఏర్పాటుకు సుముఖంగా లేవు.  అలాంటి నేపద్యంలో ఇప్పుడు కాంగ్రేస్ చేయబోతుంది అని అందరు అనుకుంటున్న పనిని తప్పుపట్టాల్సింది లేదు. అసలైన రాజకీయ నాయకుడు అధికారం కోసం దేన్నైనా విభజిస్తాడు, మరేదాన్నైనా కలుపుకొని పోతాడు. అది రాజకీయం.

జయశంకర్ సారు ఎప్పుడూ చెప్పేవాడు, తెలంగాణ ఏర్పాటు అన్నది రాజకీయ ప్రక్రియ ద్వారానే సాధ్యం అవుతుంది. ఇక్కడ ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా రాష్ట్ర ఏర్పాటు అన్నది పార్లమెంటులో  తేలాల్సిన విషయం కాబట్టి తాను తెలంగాణ కోసం పనిచేసే రాజకీయ పార్టీలకు మద్దతిస్తాను అని. 

ఇప్పుడు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కాంగ్రేస్ పెద్దల ఆలోచనలు ఇలా ఉన్నట్లు అవగతం అవుతుంది. రాష్ట్రాన్ని విడదీసి తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రేస్ లో కలుపుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని సుమారుగా అన్ని సీట్లు కైవసం చేసుకోవచ్చు.  అంతేగాక తెలంగాణ నుండి టీయ్యారెస్ తప్ప ఏ ప్రాంతీయ పార్టీ లేదు కాబట్టి కాంగ్రేస్‌కు ఎదురు లేకుండా ఉంటుంది. వైయ్యెస్సార్ సీపీ, తెలుగుదేశం పార్టీలు తెలంగాణలో మనుగడ సాగించడం  కష్టసాధ్యం.  కొత్త రాష్ట్రంలో బాబు పార్టీని, జగన్ పార్టిని ఒక మూలకు చేర్చి వాళ్ళిద్దరి పరపతిని తగ్గించవచ్చు. అదీగాక అవసరం అనుకుంటే జగన్ కు బేయిల్ ఇచ్చి ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ మద్దతు కూడా కూడగట్టుకోవచ్చు.

ఒక వేళ ఇదే జరిగితే బాబు గారికి సర్వభ్రష్టత్యమే. ఇప్పటికే "వస్తున్నా మీకోసం" అని కాళ్లు అరిగిపోయేలా తిరుగుతున్నా పచ్చ పత్రికల భజన తప్ప ప్రజల స్పందన లేదు. అలాంటిది రేపు తెలంగాణ ఏర్పాటు చేసి బాబు గారిని సీమాంధ్రలో కూర్చొబెడితే తెలుగు తమ్ముళ్లు అంతాజేరి "అన్నా తిరుమలరాయ కన్నొక్కటి కలదుగాని కౌరవపతివే" అని పాడుకోవలసి వస్తుంది. 




కొసమెరుపు:
తెలంగాణకు వ్యతిరేకంగా లగడపాటి ఏ చిన్న ప్రకటన చేసినా దాన్ని ఈనాడు పత్రిక బాక్స్ న్యూస్ లా మొదటి పేజిలో ప్రచురించేది. కానీ కాలం మారింది. అదే లగడపాటి ఇప్పుడు బాబు గారి యాత్రను ఆడ్డుకుంటానని ప్రకటించడంతో
ఈ రోజు మొదటి పేజీలో పోలీసొళ్లు విప్పించారో లేద తానే విప్పి కూర్చున్నాడో తెలియదు గాని సల్మాన్‌ఖాన్ పోజులో ఉన్న కలర్ ఫోటోను మొదటి పేజీలో ప్రచురించి ప్రభుభక్తిని చాటుకుంది.

Friday 18 January 2013

నేను మొదటి నుండి తెలంగాణ వాదినే!!


మళ్ళీ రాష్ట్రంలో కాక మొదలైంది. నాయకుల మాటల్లో హాస్యం పెరిగింది. తెలుగు చానల్స్ ఊహాగానాలకు ఉప్పుకారం చల్లి వార్తల్లాగా వడ్డిస్తున్నాయి.

నిన్న రాత్రి ఏబీఎన్ చానల్ వారు బిగ్ డిబేట్లో శైలజానాథ్, కేశవరావు, పబ్బం హరిని కేమరా ముందుకు తెచ్చారు. చర్చ మొదట్లోనే నేను ఎవరితో డిబేట్లో పాల్గొనను అని కేశవరావు స్పష్టం చేసారు. ఆర్కే కోరిక మేరకు ఆయనతోనే మాట్లాడతానన్నారు.

చర్చ శైలజానాథ్‌తో మొదలై మొన్న వాయిలార్ రవి గారు టీజీ వెంకటేష్ బృందంతో అన్న మాటలపై, తెలంగాణ ఇస్తే హైదరాబాద్ పరిస్తితి ఏంటి అన్న విశయాలపై ఇంకా చాలా సమస్యలపై విశ్లేషణ పేరుతో ఓ గంటకు పైగా ఈకలు పీకారు. హరి గారు మాత్రం తెలంగాణ వచ్చిన రాకున్న పెద్ద తేడా ఉండదు అన్నట్లు ఉన్నా శైలజానాథ్ గారి మొహంలో మాత్రం నిస్తేజం కొట్టొచ్చినట్లుగా కనబడింది. అంతా అయిపోయింది అన్నట్లుగా కూర్చున్నాడు. ఇంతకుముందు ఉన్న దూకుడు లేదు. రాజీనామా చేస్తాం అని మాటవరసకు కూడా అనలేదు సరి కదా చివరికి ఆర్కే గారి బలవంతం మీద తను క్రమశిక్షణగల కాంగ్రేస్ కార్యకర్తనని అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పాడు.


పెద్దగా కొత్త విశయాలు ఎవరూ పంచుకోక పోయినా, ఒక విశయం మాత్రం నవ్వు తెప్పించింది. మాటల సందర్భంలో శైలజానాథ్ ఆర్కే గారిని మీరు సమైక్యవాది అంటే వెంటనే లేదు లేదు నేను మొదటి నుండి తెలంగాణ వాదినే!! చెప్పుకోవడం.

తెలంగాణ వార్తల విశయంలో ఆర్కే గారి పత్రిక చేసే యాగి అందరికి తెలిసిందే. చిలువలు పలువలు చేయడం, గోరంతను కొండంత చేయడం తెలంగాణ నాయకుల్లో విభేదాలు సృష్టించడానికి పడరాని పాట్లు పడి చీకొట్టించుకోవడం నేను గమనించిన సంగతులు.

ఏ మాత్రం ప్రాధాన్యతలేని బాబు గారి యాత్రకు అదేదో చంద్రమండల యాత్రలా చంద్రయాన్ అని పేరుపెట్టి రోజూ డబ్బాగొట్టే సారు ఇప్పుడు నేను తెలంగాణా వాదిని బుకాయించడం నిజంగా హాస్యస్పదం.

Thursday 25 October 2012

నాన్ దా చంద్రబాబు ని !!

ఇప్పడు రాష్ట్రంలో ఉన్న అనిశ్చితికి, కాంగ్రేస్ తెలివితక్కువ పాలనకు ఏ ఎన్నికలో నిలబడ్డా తెలుగు తమ్ముళ్ల విజయం నల్లేరు మీద నడకలా సాగాలి. కానీ బాబు గారి జాతకంలో సాడేసాత్ నడుస్తుండడంతో ఎక్కడా దరావత్ కూడా దక్కడం లేదు. బెట్టింగు రాయుళ్లు తెలుగుదేశం అభ్యర్థి గెలుపోటముల మీద కాకుండా డిపాజిట్ దక్కించుకుంటాడా లేదా అని బెట్టింగులు కడుతున్నారు.

ఈ ప్రభుత్వం కూలిపోతే తన సైకిలే పంక్చర్ అవుతుందన్న భయంతో, లోపాయకారి ఒప్పందాలతో అధికార పక్షానికి కూలీ లేని వాచ్‌మన్‌లా కుక్కు కాపలాకాయడం ప్రతిపక్ష నాయకునిగా బాబు గారికి ఇప్పుడు అంటుకున్న అదనపు బాధ్యత.

వీటికి తోడు కుటుంబంలో జోతిష్యుని సలహా మేరకు నక్కను పెంచుకొని దాన్న "చంద్రబాబు" అని ముద్దుగా పిల్చుకుంటున్న హరికృష్ణ, ఎప్పటికైనా సీఎంనవుతాని తొడగొట్టే బాలయ్య ఒక ఎత్తైతే, ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారాన్ని బట్టీ పట్టుకొని తిరుగున్న చిన్న ఎంటీయార్ మరొక ఎత్తు. మొన్నోసారి మామ ముందు బుద్దిగా చేతులు కట్టుకొని పొల్లుపోకుండా ప్రమాణ స్వీకార పాఠం అప్పజెపితే గుటకలు మింగుతూ "చాలా బాగా చెప్పావు" అని మెచ్చుకోవలసిన ఖర్మ మన బాబు గారిది. తన మామ ఎంటీయార్ ను గద్దెదించి కుర్చి ఎక్కితే, ఈ ఎంటీయార్ తన మామను గద్దెదించి కుర్చీ ఎక్కోచ్చు. History repeats itself !!

ఇవన్నీ చాలవన్నట్లు గుండెల మీద గుదిబండలా కూర్చున్న తెలంగాణా అంశం. ఇప్పటికే రెండుకళ్ల సిద్ధాంతంతో తెలంగాణాలో పార్టీ మొత్తం ఖాళీ అయింది. ఖరాకండిగా సమైక్యాంధ్రకు మద్దతిస్తానని చెప్పకుండా సీమాంధ్రలో, తెలంగాణా ప్రకటన వెళువడిన వెంటనే ప్లేటు పిరాయించినందుకు తెలంగాణాలో చీకొట్టించుకుని రెంటికి రెడ్డ రేవడిలా మిగిలాడు.


వద్దు బాబు వద్దు. ఇలాంటి కష్టాలు చంద్రబాబుకు కూడా రావద్దు అని కర్యకర్తలు కళ్లనీళ్లు పెట్టుకుంటున్న తరణమిది.

ఇలా ఖర్మ కాలిపోయి, సగం రాజకీయ జీవితం సంకనాకిపోయి, పొసిషన్ క్రిటికల్‌గా ఉన్నప్పుడు ఏంచేయాలి? నడవాలి. ఆపకుండా నడవాలి. నడక సామాన్యుడికి ఆరోగ్యాన్నిస్తే రాజకీయనాయకుడికి అధికారాన్ని ఇస్తుంది. నేటి పాద యాత్రలే రేపటి సంపద యాత్రలు. అందుకే ఇప్పుడు రెండు కాళ్లకు ఫారెన్ షూ కట్టి "నాన్‌‌దా చంద్రబాబుని" అని ముందుకు దూకాడు. తనను తాను శిక్షించుకోనైనా పార్టీని రక్షించడానికి ముందుకు వచ్చాడు. తెలుగు తమ్ముళ్లు పులకరించేలా, పచ్చ మీడియా పరవశించేలా నడుక మొదలు పెట్టాడు. కొన్ని రోజులవరకూ రాష్ట్ర ప్రజలకు అదనపు ఎంటర్‌టేన్మెంట్‌. అధికారం అందుతుందంటే రాష్టం అంతా నడవడమే కాదు దేకమన్నా దేకుతడు. ఇప్పుడు బాబు గారి డెస్పరేషన్ అలాంటిది.


Courtesy: http://goo.gl/zIJfg

రంగులు మార్చడంలో ఊసరవెళ్లికి "పవర్ పాయింట్ ప్రెసెంటేషన్" ఇచ్చే బాబు గారు పవర్ కోసం ప్రాకులాడుతు మన కోసం వస్తున్నాడు. కోరిన కోర్కెలు తీరుస్తూ నోటికి వచ్చిన వాగ్ధానం చేస్తూ మన వద్దకే వస్తున్నాడు.

వినేవాడు వెర్రి పుష్పం అయితే చెప్పేవాడు....చంద్రబాబు.

Tuesday 23 October 2012

గంగ, రాంబాబు - బ్రాహ్మణిజం.

కొన్ని రోజుల నుండి మీడియాలో  రెండు సినిమా పేర్లు ప్రముఖంగా  కనబడుతున్నాయి. ఒకటి  ఎ ఉమన్ ఇన్ బ్రాహ్మణిజం (A woman in Braammanism), రెండు కెమరామెన్ గంగతో రాంబాబు. రెండు సినిమాలు, రెండు ధోరణులు. ఒకటి ట్రేలర్ తోనే సంచలనం కలిగిస్తే మరొకటి  విడుదలై వివాదం సృష్టించింది.

మొదటిది 1937 లో వచ్చిన చలం గారి బ్రాహ్మనీకం నవల అధారంగా తీసిన సినిమ. లో బడ్జెట్ ఫిల్మ్. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, సాహిత్యం, నిర్మాత, దర్శకుడు అన్నీ ఒక్కడే, జీ. టీ పూరి. దర్శకుడు శక్తి వంచన లేకుండా అన్ని సీన్లలో సహజత్వాన్ని జొప్పించాడు. నటీనటులు కూడా నటనలో జీవించారు. దాంతో సినిమా ఒక దృశ్యకావ్యంలా వచ్చింది.

చలం గారి బ్రాహ్మణీకం అప్పుడెప్పుడో 75 సంవత్సరల క్రితం వచ్చిన నవల. స్థూలంగా ఇందులో ఉన్నది ఏమిటంటే, సాంప్రదాయాలు, సనాతన ధర్మాలు పట్టుకొని ఏమాత్రం స్వతహాగా ఆలోచించలేని సుందరమ్మ, తండ్రిని, భర్తను కోల్పోయి మేనమామ ఇంట్లో ఉంటున్నప్పుడు అక్కడొక సంగీతం మాస్టారుచే (చంద్రశేఖరం) వంచించబడి గర్భవతి అవుతుంది. విశయం తెలిసిన మేనమామ బలవంతంగా ఈమెను చంద్రశేఖరానికి ఇచ్చి పెళ్లి చేసినా అక్కడా సుఖామెరుగక పుట్టిన బిడ్డను ఎలా పెంచాలో తెలియక జబ్బుపడ్డ బిడ్డను కాపాడుకునే యత్నంలో ఓ బ్రాహ్మణద్వేషి (రామయ్య) మోసానికి బలై, అప్రయత్నంగా అతని చావుకు కారణమై చివరికి చనిపోయిన బిడ్డతో పాటు తనూ తనువు చాలిస్తుంది.



బ్రాహ్మణిజం సినిమా steaming trailer చూస్తే ఈ కథకు ఆ సినిమాకు ఎక్కడా పోలిక ఉన్నట్లు కనబడదు. పూర్తి సినిమాలో ఏమైనా ఉంటుందో తెలియదు. అందుకొసం నవంబర్ పదహారు వరకు ఆగాలి. కానీ దర్శకుని ఉద్ధేశం ఏమిటన్నది మాత్రం ట్రేలర్ లోనే బోధపడీంది.

ఆత్రం పెళ్ళికొడుకులా అవకాశం కోసం కాసుకొని కూర్చున్న మీడియా చానల్స్‌కు ఇదో మాంచి అవకాశం. ఈ సినిమా ట్రేలర్ క్లిప్పింగులను గుప్పించి డిబేట్స్ పేరు మీద ఇప్పటికే అన్ని చానల్స్ తమ తమ టీఆర్‌పీ రేటింగును పెంచుకునే ప్రయత్నం లో ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి

ఇందులో చెప్పుకోదగ్గది ఓ నాలుగు రోజుల క్రితం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లో వచ్చిన చర్చా కార్యక్రమం. ఎప్పటి లాగే మూర్తి గారు చర్చను నిర్వహిస్తే, ఇందులో పాల్గొనడానికి ఈ సినిమా నిర్మాత గంగాధర్ (ట్రేలర్ లో మాత్రం నిర్మాత పేరు పూరి అని ఉంది), రాష్ట్ర భ్రాహ్మణ సంఘం యువజన విభాగం అధ్యక్షులు రవికుమార్, వేద విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు పద్మనాభశర్మ వచ్చారు. బ్రాహ్మణీకమా? బూతు పైత్యమా? అన్న హెడింగ్ తో చర్చ మొదలు పెట్టారు. దీనికి ముందు మసాలా సన్నివేశాలన్నీ విచ్చల విడిగా చూపించేసారు. చర్చ మొదలు పెట్టిన ఐదు నిమిషాల్లోనే ఊపందుకుంది.

నిర్మాత కమర్షియల్ అడ్వాంటేజ్ కోసం మసాలా దట్టించాము కానీ దానికి ఇంత గొడవ అవుతుందని అనుకోలేదు. సినిమాను పూర్తిగా బ్యాన్ చేస్తే తట్టుకునే ఆర్థిక స్థోమత లేదు. ఏమైనా అభ్యంతరకరమైన సీన్లు ఉంటే తొలిగిస్తాము. మీరు ట్రేలర్ చూసి పొరపడుతున్నారు. పూర్తి సినిమా చూస్తే కళ్లనీళ్లు పెట్టుకుంటారు అని చెప్పాడు.

ఇంత వరకు ఆవేశం ఆపుకుని కూర్చున్న మిగతా ఇద్దరు సభ్యులు వాళ్ల టైం రాగానే ఈ సినిమాని ఒక హిందుమత వ్యతిరేక సినిమాగా చిత్రించి, నిర్మాత దర్శకుల తల్లిని, చెల్లిని పెట్టి సినిమా తీయమనండి. ఇలాంటి సినిమాకు వ్యతిరేకంగా ప్రతి బ్రాహ్మణుడు ఒక పరశురాముడు అవుతాడు. మా కులం వాళ్లు రాసిన పాటలతో, కథలతో, డైలాగ్స్‌తో సినిమాలు హిట్లు చేసుకుంటూ ఇప్పుడు మమ్మల్నే అవమానపరుస్తారా అని చిందులుతొక్కారు.

ఇది ఇలా నడుస్తుండగానే లైవ్ లోకి ఫోన్ ద్వారా మిగతా వాళ్లు రావడం తోచింది చెప్పడం జరిగింది. ఇందులో చెప్పుకోవలసింది నృత్యకళాకారిణి స్వాతీసోంనాథ్ గురించి.

లైవ్ షో లో చూపిస్తున్న దృష్యాలను చూస్తు బీపీ పెంచుకున్న ఈవిడకు ఆవేశం కట్టలు తెంచుకోవడంతో గుండెరగిలి స్టూడియోకు ఫోన్ కొట్టి గంగాధర్ ను కడిగి పరేసింది. ఇలాంటి సినిమాలు మళ్లీ రాకుండా సెన్సార్ సభులందరిని రాళ్లతో కొట్టి చంపాలి, సినిమా యునిట్ ను ఉరితీయాలి అని పరిష్కారించింది. స్టూడియోలో ఉన్న మిగతా వక్తలు (మూర్తి మినహా) కూడా ఇలాంటి సినిమాలు తీస్తే వాళ్ల అంతు చూస్తాం అని తీర్మానించారు.

వీళ్ల దాటికి తట్టుకోలేక లేచి పోతున్న గంగాధర్ను ఆపడానికి మూర్తి ప్రయత్నించినా రవికుమారు నువ్వెంత నీ బ్రతుకెంత బూతు సినిమాలు తీసుకునే దొంగనా కొడకా చెప్పుల దండ వేసి కొడతాం అని బూతుపురాణం విప్పడతో మైక్ పారేసి వెళ్లిపోయాడు.

ఇక్కడ రాయడానికి గుర్తులేదు కానీ చర్చ సుమారు ఓ గంట సేపు కాట్ల కుక్కల కొట్లాటలా చాలా రసవత్తరంగా జరిగింది

పెద్ద ఎంటీయార్, చిన్న ఎంటీయార్, బాలయ్య బాబు ఇలా నందమూరి వంశం వారు ఎవరు సినిమా తీసినా అందులో బ్రాహ్మణులను చులకన చేయడం అనాదిగా వస్తున్న సినీ ఆచారం. వాటిపైన ఎన్నడూ ఎంత వ్యతిరేకత వచ్చినట్టు కనబడదు. అదీగాక వీళ్ల సినిమాల్లో బ్రాహ్మణులపై హాస్యం ఉంటుంది. అశ్లీలత ఉండదు. కాని ఈ సినిమా మాత్రం శృతి మించింది. కొసరు దృష్యాలే "మల్లు" సినిమాలను మరిపించేలా ఉన్నాయి. ఈ సినిమాకు బ్రాహ్మణిజం అని కాకుండా వేరే ఏ పేరు పెట్టిన ఇంత లొళ్లి అయ్యేది కాదు.

మీడియాలో నానుతున్న మరో సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబు. (కెమెరా ఉమన్ గంగ అనాలి కదాని లాజిక్‌లు మాట్లాడొద్దు) దీని గురించి పెద్దగా రాయడానికి ఏం లేదు. ఏదో చెప్పాలనుకుని, ఆవేశంతో, ఆలోచన లేకుండా ప్రాంతీయ రాజకీయాలను చులకన చేస్తు, తెలివితక్కువ అభిమానులు కళ్లు మూసుకుని సినిమా చూస్తార్లే అన్న ధీమా తో తీసిన సినిమ. ఇప్పటికే నిర్మాత జేబు నిండేందుకు కావలసినంత వేడిని పుట్టించింది.

సీమాంధ్రాలో పీకే అభిమానులు I mean, Pawan Kalyan (PK) fans సంగతేమో కానీ తెలంగాణా లో మాత్రం పీకే బాబు ఏది చుపిస్తే అది చూసి చిత్తుకాగితాలు ఎగిరేస్తు విజిల్సు వేసే కాలం లో నుండి బయటకు వచ్చారు. ఇంకా బయటకు రావాలి. సినిమా, మీడియా ముసుగులో జరుగుతున్నబాగోతం అర్థం చేసుకోవాలి. కానీ ఆలోచన ఉన్నవాడు అభిమాని కాలేడు. రాంగోపాల్ వర్మ ఎప్పుడు చెప్తుంటాడు. తెలుగు ప్రేక్షకులు దద్దమలు, సినిమాకు వచ్చేముందు మెదడు ఇంట్లో పెట్టివస్తారు అనుకోని సినిమాతీయాలి, నేనే కాదు అందరు దర్శకులు అలాగే తీస్తారు. ప్రేక్షకుడు సినిమ చూసి తార్కిక చింతన చేస్తే ఏ సినిమా ఆడదు అని. ఇలాంటి సినిమాలు విడుదలైనప్పుడు మాత్రం ప్రేక్షకులే కాదు సెన్సార్ సభ్యులు కూడా మెదడు లేని వాళ్లనే అర్థం అవుతుంది.


Courtesy: Andhrajyothy
వచ్చేనెల విడుదలవబోయే బ్రాహ్మణిజం సినిమాను ఆపాలని కుల సంఘాలు, వాటికి కొమ్ముకాసే రాజకీయ పార్టీలు సిద్ధమైతే, రాంబాబు సినిమాకు శాస్తిగా తెలంగాణా ప్రజలు పూరీ మెడలు వంచి క్షమాపణలు చెప్పించి పదిహేను సీన్లకు అంటకత్తరేసి వదిలారు.

ఆలోచన లేకుండా ఆవేశంతో సినిమాలు తీసే సింగిల్ పూరీలు, చపాతీలు ఇండస్ట్రీలో ఉన్నంత కాలం తెలుగు సినిమాలు ఇలాగే ఎడుస్తాయి.

Friday 19 October 2012

తెలంగాణా మీడియాపై వివక్ష?

మొన్న ప్రధాని మన్‌మోహన్ సింగ్ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు కేవలం తెలంగాణ పత్రిక ప్రతినిధులనే రాకుండా అడ్డుకోవడం నిజంగా అందరూ ఖండించ వలసిన విశయమే. దేశానికి ప్రధాన మంత్రై ఉండి అందరినీ సమానంగా చూడాల్సిన వ్యక్తి కేవలం కొందరినే చేరదీయడం బాదాకరమైనదే. ఇది తెలంగాణ మీడియాపై ప్రత్యక్షంగా కనబడ్డ వివక్ష. కానీ ఈ సంఘటను అన్ని తెలుగు పత్రికలు వ్యతిరేకించాలి అని తెలంగాణ పత్రికలు కోరడం మాత్రం సరైనదా అనిపిస్తుంది.

తెలంగాణలో సీమాంధ్ర మీడియాపై వివక్ష లేదా అంటే ఎందుకు లేదు. బోలెడంత ఉంది. ఐతే అది ప్రజల్లో ఉంది. వీడు మనోడు కాదు. వీన్ని నమ్ముకుంటే నిండా ముంచుతాడు, వీడి చానల్లో, పేపర్లో వార్తలన్నీ పచ్చి అబద్ధాలు అని కొన్ని పేపర్ల గురించి, కొన్ని చానల్ల గురించి ప్రజలు భావించడం, సభలు, సమావేశాలు జరిగినప్పుడు ఇటువంటి అర్థం వచ్చేలా బ్యానర్లు కట్టడం కూడా గమనించ వచ్చు.  దీన్ని ఎన్నడూ ఏ పత్రిక తప్పు అని చెప్పలేదు. ఎందుకంటే ఇది ప్రజాభిప్రాయం.

ఇది శృతిమించి కొన్ని సమయాల్లో సీమాంధ్ర మీడియా వాహనాలు తగలబెట్టినప్పుడు మీడియా ప్రతినిధులంతా ధర్నాలు చేసిన దఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది దాన్ని నిలదీయడానికి మీరూ రండి అని వీళ్ళను తోడు రమ్మంటే ఎలా వస్తారు. రారు కదా, మంచిగైందని ముడుచుకు కూర్చుంటారు.

వీళ్ల తోడు అడగక పోవడమే మంచిది.


ఒక వేళ వీళ్లకు ప్రధానిని కలిసే అవకాశం వచ్చినా, పార్లమెంటులో విపక్షాల ప్రశ్నలకు మేడం అనుమతి లేకుండా నోరు తెరువని వాడు వీళ్లు అడిగే ప్రశ్నలకు తను నోరు విప్పేవాడా ఆంటే అనుమానమే.