Tuesday 23 October 2012

గంగ, రాంబాబు - బ్రాహ్మణిజం.

కొన్ని రోజుల నుండి మీడియాలో  రెండు సినిమా పేర్లు ప్రముఖంగా  కనబడుతున్నాయి. ఒకటి  ఎ ఉమన్ ఇన్ బ్రాహ్మణిజం (A woman in Braammanism), రెండు కెమరామెన్ గంగతో రాంబాబు. రెండు సినిమాలు, రెండు ధోరణులు. ఒకటి ట్రేలర్ తోనే సంచలనం కలిగిస్తే మరొకటి  విడుదలై వివాదం సృష్టించింది.

మొదటిది 1937 లో వచ్చిన చలం గారి బ్రాహ్మనీకం నవల అధారంగా తీసిన సినిమ. లో బడ్జెట్ ఫిల్మ్. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, సాహిత్యం, నిర్మాత, దర్శకుడు అన్నీ ఒక్కడే, జీ. టీ పూరి. దర్శకుడు శక్తి వంచన లేకుండా అన్ని సీన్లలో సహజత్వాన్ని జొప్పించాడు. నటీనటులు కూడా నటనలో జీవించారు. దాంతో సినిమా ఒక దృశ్యకావ్యంలా వచ్చింది.

చలం గారి బ్రాహ్మణీకం అప్పుడెప్పుడో 75 సంవత్సరల క్రితం వచ్చిన నవల. స్థూలంగా ఇందులో ఉన్నది ఏమిటంటే, సాంప్రదాయాలు, సనాతన ధర్మాలు పట్టుకొని ఏమాత్రం స్వతహాగా ఆలోచించలేని సుందరమ్మ, తండ్రిని, భర్తను కోల్పోయి మేనమామ ఇంట్లో ఉంటున్నప్పుడు అక్కడొక సంగీతం మాస్టారుచే (చంద్రశేఖరం) వంచించబడి గర్భవతి అవుతుంది. విశయం తెలిసిన మేనమామ బలవంతంగా ఈమెను చంద్రశేఖరానికి ఇచ్చి పెళ్లి చేసినా అక్కడా సుఖామెరుగక పుట్టిన బిడ్డను ఎలా పెంచాలో తెలియక జబ్బుపడ్డ బిడ్డను కాపాడుకునే యత్నంలో ఓ బ్రాహ్మణద్వేషి (రామయ్య) మోసానికి బలై, అప్రయత్నంగా అతని చావుకు కారణమై చివరికి చనిపోయిన బిడ్డతో పాటు తనూ తనువు చాలిస్తుంది.



బ్రాహ్మణిజం సినిమా steaming trailer చూస్తే ఈ కథకు ఆ సినిమాకు ఎక్కడా పోలిక ఉన్నట్లు కనబడదు. పూర్తి సినిమాలో ఏమైనా ఉంటుందో తెలియదు. అందుకొసం నవంబర్ పదహారు వరకు ఆగాలి. కానీ దర్శకుని ఉద్ధేశం ఏమిటన్నది మాత్రం ట్రేలర్ లోనే బోధపడీంది.

ఆత్రం పెళ్ళికొడుకులా అవకాశం కోసం కాసుకొని కూర్చున్న మీడియా చానల్స్‌కు ఇదో మాంచి అవకాశం. ఈ సినిమా ట్రేలర్ క్లిప్పింగులను గుప్పించి డిబేట్స్ పేరు మీద ఇప్పటికే అన్ని చానల్స్ తమ తమ టీఆర్‌పీ రేటింగును పెంచుకునే ప్రయత్నం లో ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి

ఇందులో చెప్పుకోదగ్గది ఓ నాలుగు రోజుల క్రితం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లో వచ్చిన చర్చా కార్యక్రమం. ఎప్పటి లాగే మూర్తి గారు చర్చను నిర్వహిస్తే, ఇందులో పాల్గొనడానికి ఈ సినిమా నిర్మాత గంగాధర్ (ట్రేలర్ లో మాత్రం నిర్మాత పేరు పూరి అని ఉంది), రాష్ట్ర భ్రాహ్మణ సంఘం యువజన విభాగం అధ్యక్షులు రవికుమార్, వేద విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు పద్మనాభశర్మ వచ్చారు. బ్రాహ్మణీకమా? బూతు పైత్యమా? అన్న హెడింగ్ తో చర్చ మొదలు పెట్టారు. దీనికి ముందు మసాలా సన్నివేశాలన్నీ విచ్చల విడిగా చూపించేసారు. చర్చ మొదలు పెట్టిన ఐదు నిమిషాల్లోనే ఊపందుకుంది.

నిర్మాత కమర్షియల్ అడ్వాంటేజ్ కోసం మసాలా దట్టించాము కానీ దానికి ఇంత గొడవ అవుతుందని అనుకోలేదు. సినిమాను పూర్తిగా బ్యాన్ చేస్తే తట్టుకునే ఆర్థిక స్థోమత లేదు. ఏమైనా అభ్యంతరకరమైన సీన్లు ఉంటే తొలిగిస్తాము. మీరు ట్రేలర్ చూసి పొరపడుతున్నారు. పూర్తి సినిమా చూస్తే కళ్లనీళ్లు పెట్టుకుంటారు అని చెప్పాడు.

ఇంత వరకు ఆవేశం ఆపుకుని కూర్చున్న మిగతా ఇద్దరు సభ్యులు వాళ్ల టైం రాగానే ఈ సినిమాని ఒక హిందుమత వ్యతిరేక సినిమాగా చిత్రించి, నిర్మాత దర్శకుల తల్లిని, చెల్లిని పెట్టి సినిమా తీయమనండి. ఇలాంటి సినిమాకు వ్యతిరేకంగా ప్రతి బ్రాహ్మణుడు ఒక పరశురాముడు అవుతాడు. మా కులం వాళ్లు రాసిన పాటలతో, కథలతో, డైలాగ్స్‌తో సినిమాలు హిట్లు చేసుకుంటూ ఇప్పుడు మమ్మల్నే అవమానపరుస్తారా అని చిందులుతొక్కారు.

ఇది ఇలా నడుస్తుండగానే లైవ్ లోకి ఫోన్ ద్వారా మిగతా వాళ్లు రావడం తోచింది చెప్పడం జరిగింది. ఇందులో చెప్పుకోవలసింది నృత్యకళాకారిణి స్వాతీసోంనాథ్ గురించి.

లైవ్ షో లో చూపిస్తున్న దృష్యాలను చూస్తు బీపీ పెంచుకున్న ఈవిడకు ఆవేశం కట్టలు తెంచుకోవడంతో గుండెరగిలి స్టూడియోకు ఫోన్ కొట్టి గంగాధర్ ను కడిగి పరేసింది. ఇలాంటి సినిమాలు మళ్లీ రాకుండా సెన్సార్ సభులందరిని రాళ్లతో కొట్టి చంపాలి, సినిమా యునిట్ ను ఉరితీయాలి అని పరిష్కారించింది. స్టూడియోలో ఉన్న మిగతా వక్తలు (మూర్తి మినహా) కూడా ఇలాంటి సినిమాలు తీస్తే వాళ్ల అంతు చూస్తాం అని తీర్మానించారు.

వీళ్ల దాటికి తట్టుకోలేక లేచి పోతున్న గంగాధర్ను ఆపడానికి మూర్తి ప్రయత్నించినా రవికుమారు నువ్వెంత నీ బ్రతుకెంత బూతు సినిమాలు తీసుకునే దొంగనా కొడకా చెప్పుల దండ వేసి కొడతాం అని బూతుపురాణం విప్పడతో మైక్ పారేసి వెళ్లిపోయాడు.

ఇక్కడ రాయడానికి గుర్తులేదు కానీ చర్చ సుమారు ఓ గంట సేపు కాట్ల కుక్కల కొట్లాటలా చాలా రసవత్తరంగా జరిగింది

పెద్ద ఎంటీయార్, చిన్న ఎంటీయార్, బాలయ్య బాబు ఇలా నందమూరి వంశం వారు ఎవరు సినిమా తీసినా అందులో బ్రాహ్మణులను చులకన చేయడం అనాదిగా వస్తున్న సినీ ఆచారం. వాటిపైన ఎన్నడూ ఎంత వ్యతిరేకత వచ్చినట్టు కనబడదు. అదీగాక వీళ్ల సినిమాల్లో బ్రాహ్మణులపై హాస్యం ఉంటుంది. అశ్లీలత ఉండదు. కాని ఈ సినిమా మాత్రం శృతి మించింది. కొసరు దృష్యాలే "మల్లు" సినిమాలను మరిపించేలా ఉన్నాయి. ఈ సినిమాకు బ్రాహ్మణిజం అని కాకుండా వేరే ఏ పేరు పెట్టిన ఇంత లొళ్లి అయ్యేది కాదు.

మీడియాలో నానుతున్న మరో సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబు. (కెమెరా ఉమన్ గంగ అనాలి కదాని లాజిక్‌లు మాట్లాడొద్దు) దీని గురించి పెద్దగా రాయడానికి ఏం లేదు. ఏదో చెప్పాలనుకుని, ఆవేశంతో, ఆలోచన లేకుండా ప్రాంతీయ రాజకీయాలను చులకన చేస్తు, తెలివితక్కువ అభిమానులు కళ్లు మూసుకుని సినిమా చూస్తార్లే అన్న ధీమా తో తీసిన సినిమ. ఇప్పటికే నిర్మాత జేబు నిండేందుకు కావలసినంత వేడిని పుట్టించింది.

సీమాంధ్రాలో పీకే అభిమానులు I mean, Pawan Kalyan (PK) fans సంగతేమో కానీ తెలంగాణా లో మాత్రం పీకే బాబు ఏది చుపిస్తే అది చూసి చిత్తుకాగితాలు ఎగిరేస్తు విజిల్సు వేసే కాలం లో నుండి బయటకు వచ్చారు. ఇంకా బయటకు రావాలి. సినిమా, మీడియా ముసుగులో జరుగుతున్నబాగోతం అర్థం చేసుకోవాలి. కానీ ఆలోచన ఉన్నవాడు అభిమాని కాలేడు. రాంగోపాల్ వర్మ ఎప్పుడు చెప్తుంటాడు. తెలుగు ప్రేక్షకులు దద్దమలు, సినిమాకు వచ్చేముందు మెదడు ఇంట్లో పెట్టివస్తారు అనుకోని సినిమాతీయాలి, నేనే కాదు అందరు దర్శకులు అలాగే తీస్తారు. ప్రేక్షకుడు సినిమ చూసి తార్కిక చింతన చేస్తే ఏ సినిమా ఆడదు అని. ఇలాంటి సినిమాలు విడుదలైనప్పుడు మాత్రం ప్రేక్షకులే కాదు సెన్సార్ సభ్యులు కూడా మెదడు లేని వాళ్లనే అర్థం అవుతుంది.


Courtesy: Andhrajyothy
వచ్చేనెల విడుదలవబోయే బ్రాహ్మణిజం సినిమాను ఆపాలని కుల సంఘాలు, వాటికి కొమ్ముకాసే రాజకీయ పార్టీలు సిద్ధమైతే, రాంబాబు సినిమాకు శాస్తిగా తెలంగాణా ప్రజలు పూరీ మెడలు వంచి క్షమాపణలు చెప్పించి పదిహేను సీన్లకు అంటకత్తరేసి వదిలారు.

ఆలోచన లేకుండా ఆవేశంతో సినిమాలు తీసే సింగిల్ పూరీలు, చపాతీలు ఇండస్ట్రీలో ఉన్నంత కాలం తెలుగు సినిమాలు ఇలాగే ఎడుస్తాయి.