Friday 18 January 2013

నేను మొదటి నుండి తెలంగాణ వాదినే!!


మళ్ళీ రాష్ట్రంలో కాక మొదలైంది. నాయకుల మాటల్లో హాస్యం పెరిగింది. తెలుగు చానల్స్ ఊహాగానాలకు ఉప్పుకారం చల్లి వార్తల్లాగా వడ్డిస్తున్నాయి.

నిన్న రాత్రి ఏబీఎన్ చానల్ వారు బిగ్ డిబేట్లో శైలజానాథ్, కేశవరావు, పబ్బం హరిని కేమరా ముందుకు తెచ్చారు. చర్చ మొదట్లోనే నేను ఎవరితో డిబేట్లో పాల్గొనను అని కేశవరావు స్పష్టం చేసారు. ఆర్కే కోరిక మేరకు ఆయనతోనే మాట్లాడతానన్నారు.

చర్చ శైలజానాథ్‌తో మొదలై మొన్న వాయిలార్ రవి గారు టీజీ వెంకటేష్ బృందంతో అన్న మాటలపై, తెలంగాణ ఇస్తే హైదరాబాద్ పరిస్తితి ఏంటి అన్న విశయాలపై ఇంకా చాలా సమస్యలపై విశ్లేషణ పేరుతో ఓ గంటకు పైగా ఈకలు పీకారు. హరి గారు మాత్రం తెలంగాణ వచ్చిన రాకున్న పెద్ద తేడా ఉండదు అన్నట్లు ఉన్నా శైలజానాథ్ గారి మొహంలో మాత్రం నిస్తేజం కొట్టొచ్చినట్లుగా కనబడింది. అంతా అయిపోయింది అన్నట్లుగా కూర్చున్నాడు. ఇంతకుముందు ఉన్న దూకుడు లేదు. రాజీనామా చేస్తాం అని మాటవరసకు కూడా అనలేదు సరి కదా చివరికి ఆర్కే గారి బలవంతం మీద తను క్రమశిక్షణగల కాంగ్రేస్ కార్యకర్తనని అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పాడు.


పెద్దగా కొత్త విశయాలు ఎవరూ పంచుకోక పోయినా, ఒక విశయం మాత్రం నవ్వు తెప్పించింది. మాటల సందర్భంలో శైలజానాథ్ ఆర్కే గారిని మీరు సమైక్యవాది అంటే వెంటనే లేదు లేదు నేను మొదటి నుండి తెలంగాణ వాదినే!! చెప్పుకోవడం.

తెలంగాణ వార్తల విశయంలో ఆర్కే గారి పత్రిక చేసే యాగి అందరికి తెలిసిందే. చిలువలు పలువలు చేయడం, గోరంతను కొండంత చేయడం తెలంగాణ నాయకుల్లో విభేదాలు సృష్టించడానికి పడరాని పాట్లు పడి చీకొట్టించుకోవడం నేను గమనించిన సంగతులు.

ఏ మాత్రం ప్రాధాన్యతలేని బాబు గారి యాత్రకు అదేదో చంద్రమండల యాత్రలా చంద్రయాన్ అని పేరుపెట్టి రోజూ డబ్బాగొట్టే సారు ఇప్పుడు నేను తెలంగాణా వాదిని బుకాయించడం నిజంగా హాస్యస్పదం.