Tuesday 22 January 2013

అన్నా తిరుమలరాయ..

తెలంగాణ మీద డిల్లీ నుండి వెళువడుతున్న ప్రకటనలకు ఇక్కడ సీమాంధ్ర నాయకులకు చురుకు తగులుతుంది. ఇప్పుడు అన్ని ప్రాంత నేతల వాదనలలో వేడి పెరిగింది. ఇన్నాళ్లు తెరచాటు రాజకీయాలు నడిపిన కే"వీపి" లు కూడా ఇప్పుడు లీడ్ రోల్ తీసుకుంటున్నారు. ప్రజల కోరిక మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి తప్ప తుచ్చమైన రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విడదీయకూడదట.


ఈరోజే కాదు మరెప్పుడైనా తెలంగాణ అన్నది ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే అది పార్టీల రాజకీయ లబ్దికోసకే ఏర్పడుతుంది తప్ప ఇక్కడ ప్రజల కోరికను మన్నించి ఎంత మాత్రం కాదు. అన్ని పార్టీలు తెలంగాణ భావోద్వేగాలను ఓట్లలా మలుచుకోవడానికే రెడీగా ఉన్నాయి తప్ప తెలంగాణ ప్రజల కోరిక మేరకు రాష్ట్ర ఏర్పాటుకు సుముఖంగా లేవు.  అలాంటి నేపద్యంలో ఇప్పుడు కాంగ్రేస్ చేయబోతుంది అని అందరు అనుకుంటున్న పనిని తప్పుపట్టాల్సింది లేదు. అసలైన రాజకీయ నాయకుడు అధికారం కోసం దేన్నైనా విభజిస్తాడు, మరేదాన్నైనా కలుపుకొని పోతాడు. అది రాజకీయం.

జయశంకర్ సారు ఎప్పుడూ చెప్పేవాడు, తెలంగాణ ఏర్పాటు అన్నది రాజకీయ ప్రక్రియ ద్వారానే సాధ్యం అవుతుంది. ఇక్కడ ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా రాష్ట్ర ఏర్పాటు అన్నది పార్లమెంటులో  తేలాల్సిన విషయం కాబట్టి తాను తెలంగాణ కోసం పనిచేసే రాజకీయ పార్టీలకు మద్దతిస్తాను అని. 

ఇప్పుడు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కాంగ్రేస్ పెద్దల ఆలోచనలు ఇలా ఉన్నట్లు అవగతం అవుతుంది. రాష్ట్రాన్ని విడదీసి తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రేస్ లో కలుపుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని సుమారుగా అన్ని సీట్లు కైవసం చేసుకోవచ్చు.  అంతేగాక తెలంగాణ నుండి టీయ్యారెస్ తప్ప ఏ ప్రాంతీయ పార్టీ లేదు కాబట్టి కాంగ్రేస్‌కు ఎదురు లేకుండా ఉంటుంది. వైయ్యెస్సార్ సీపీ, తెలుగుదేశం పార్టీలు తెలంగాణలో మనుగడ సాగించడం  కష్టసాధ్యం.  కొత్త రాష్ట్రంలో బాబు పార్టీని, జగన్ పార్టిని ఒక మూలకు చేర్చి వాళ్ళిద్దరి పరపతిని తగ్గించవచ్చు. అదీగాక అవసరం అనుకుంటే జగన్ కు బేయిల్ ఇచ్చి ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ మద్దతు కూడా కూడగట్టుకోవచ్చు.

ఒక వేళ ఇదే జరిగితే బాబు గారికి సర్వభ్రష్టత్యమే. ఇప్పటికే "వస్తున్నా మీకోసం" అని కాళ్లు అరిగిపోయేలా తిరుగుతున్నా పచ్చ పత్రికల భజన తప్ప ప్రజల స్పందన లేదు. అలాంటిది రేపు తెలంగాణ ఏర్పాటు చేసి బాబు గారిని సీమాంధ్రలో కూర్చొబెడితే తెలుగు తమ్ముళ్లు అంతాజేరి "అన్నా తిరుమలరాయ కన్నొక్కటి కలదుగాని కౌరవపతివే" అని పాడుకోవలసి వస్తుంది. 




కొసమెరుపు:
తెలంగాణకు వ్యతిరేకంగా లగడపాటి ఏ చిన్న ప్రకటన చేసినా దాన్ని ఈనాడు పత్రిక బాక్స్ న్యూస్ లా మొదటి పేజిలో ప్రచురించేది. కానీ కాలం మారింది. అదే లగడపాటి ఇప్పుడు బాబు గారి యాత్రను ఆడ్డుకుంటానని ప్రకటించడంతో
ఈ రోజు మొదటి పేజీలో పోలీసొళ్లు విప్పించారో లేద తానే విప్పి కూర్చున్నాడో తెలియదు గాని సల్మాన్‌ఖాన్ పోజులో ఉన్న కలర్ ఫోటోను మొదటి పేజీలో ప్రచురించి ప్రభుభక్తిని చాటుకుంది.